ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ ఏజెంట్లు ఉన్నారనడానికి తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై కేంద్రం ధీటుగా స్పందించింది. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి, పసలేనవని భారత్ కొట్టిపారేసింది. అంతేకాదు, ఖలీస్థానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న కెనడా వాటి నుంచి దృష్టి మరల్చేందుకు ఈ విధమైన ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలోనే కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల సందర్భంగా కెనడా ప్రధాని లేవనెత్తినప్పుడు ఈ ఆరోపణలను తిప్పికొట్టారని నొక్కిచెప్పిన ప్రభుత్వం... ఈ ఆరోపణల వెనుక నిగూఢమైన ఉద్దేశం ఉందని పేర్కొంది. ‘కెనడాలో పార్లమెంటులో ప్రధాని ప్రకటన, విదేశాంగ మంత్రి ప్రకటనలను కూడా మేము తిరస్కరిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. ‘కెనడాలో జరిగిన ఏదైనా హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి.. ప్రేరేపితమైనవి.. కెనడా ప్రధాని మన ప్రధాన మంత్రికి ఇలాంటి ఆరోపణలు చేశారు.. వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం’ అని పేర్కొంది.
చట్టబద్ధమైన పాలనకు కట్టుబడిన ప్రజాస్వామ్య దేశంగా భారత్.. ఖలీస్థాన్ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యంగా వారికి ఆశ్రయం కల్పించడం గురించి కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.. .‘మాది చట్టబద్ధమైన పాలనకు బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్య రాజకీయం.. కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు.. తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు ప్రయత్నిస్తాయి.. భారత సార్వభౌమాధికారం... ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.. ఈ విషయంపై కెనడా ప్రభుత్వంతో దీర్ఘకాలంగా, నిరంతర ఆందోళన తెలుపుతున్నాం’ అని అధికారిక ప్రకటన పేర్కొంది.