ఒంగోలు జిల్లాలోని తీరప్రాంతంలో గోవామద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ అధికారులు ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసింది. రూ.3లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది, గోవాకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడ్డారు. గోవాలోని కార్వాన్ అనే ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. దాన్ని గుర్తించకుండా ఇక్కడి మద్యం అన్నట్లుగా లేబుళ్లు తయారు చేయించి బాటిళ్లపై అంటించి విక్రయిస్తున్నారు. ఆ విషయమై సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లత, జేడీ బృందం సీఐ వంశీ, ఎస్సై శ్రీనివాసులు, ఎస్‌ఈబీ ఎస్సై గోపాలకృష్ణలు మద్యాన్ని కారులో తరలిస్తుండగా కొత్తపట్నం మండలం మడనూరు వద్ద మాటు వేసి పట్టుకున్నారు. అందులో ఉన్న నాగులుప్పలపాడు మండలం చిన్నంగారి పట్టంపాలెంనకు చెందిన మేకల బాబు, సింగరాయికొండ మండలం ఊళ్లపాలెంనకు చెందిన అరవ ప్రవీణ్, ఉలవపాడు మండలం టెంకాయిచెట్లపాలెం గ్రామానికి చెందిన వి.వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంనకు చెందిన కటారి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3లక్షల విలువైన మద్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు.