లండన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో లండన్ వెళ్లిన ఓ ఏపీ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన కొద్ది రోజులకే అనుకోకుండా అస్వస్థతకు గురై యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడుకు చెందిన జమ్మి సుబ్బారావు ఎంఎస్ చేసేందుకు ఈనెల 8న చెన్నై నుంచి విమానంలో లండన్ వెళ్లాడు.
సుబ్బారావు అక్కడి కార్డిఫ్ నగరంలోని కార్టిస్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో రిపోర్ట్ చేసేందుకు ఈనెల 16న అక్కడి భారతీయ విద్యార్థులతో కలిసి బస్సులో బయల్దేరాడు. బస్సు ఎక్కుతుండగా ఛాతిలో నొప్పిగా ఉందని కూల్‌డ్రింక్ తాగాడు. కొద్దిసేపటికే అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. పక్కనున్న వారు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ కన్నమూశాడు.
ఈ సమాచారం చేరవేసేందుకు అక్కడి అధికారులు సుబ్బారావు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడున్న తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు బుధవారం అక్కడి స్నేహితుడొకరు సుబ్బారావు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సుబ్బారావు మృతదేహం యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ మార్చురీలో ఉన్నట్లు తెలిపారు. తమ కుమారుడి మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.