అనంతపురంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. కాచిగూడ- యశ్వంతపూర్ వందేభారత్ రైలు ట్రయిల్‌రన్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున షెడ్యూల్ ప్రకారం 5.30 గంటలకు వందేభారత్ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో 8 కోచ్‌లతో బయలుదేరింది. ట్రయిల్ రన్‌లో భాగంగా డోన్‌కు 20 నిమిషాలు ముందుగా, అనంతపురానికి 8 నిమిషాలు ముందుగా చేరుకుంది. ధర్మవరంలోనూ కాసేపు ఆగింది. యశ్వంతపూర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని, 2.40 గంటలకు యశ్వంతపూర్ నుంచి తిరిగి బయలుదేరింది. ఈ వందేభారత్ తిరుగు ప్రయాణంలో అనంతపురానికి 5.24 గంటలకు చేరుకొని 5.25 గంటలకు బయలుదేరింది. అనంతపురం స్టేషన్‌లో బీజేపీ నేతలు రైలు వద్దకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఊపి స్వాగతం పలికారు. నాయకులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ నెల 24 (ఆదివారం)న కాచిగూడ- యశ్వంతపూర్ వందే భారత్ రైలును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
ఈ వందేభారత్ కాచిగూడలో బయలుదేరి యశ్వంతపూర్‌కు వెళుతుంది. అదే రోజు రాత్రి తిరిగి కాచిగూడకు వస్తుంది. ఆదివారం రైలు ప్రారంభమైనా.. సోమవారం నుంచి రైలుకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. ట్రయల్ రన్‌లో 8 కోచ్‌లతో నడిపారు. ఈ వందేభారత్ ప్రారంభించాక ఎన్ని కోచ్‌లతో నడుపుతారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రైలు ప్రయాణ ఛార్జీలను నిర్ణయించలేదు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్, ఎకానమీ ఛైర్‌కార్లు ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు ప్రధాని నరేంద్ర మోదీ 9 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఏపీ మీదుగా మరో రైలు ప్రారంభంకానుంది.. విజయవాడ నుంచి చెన్నైకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంకానుంది. ఈ రైలు విజయవాడ నుంచి ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. గురువారం ఈ రైలు నడవదు.. ప్రతి రోజూ విజయవాడలో ఉదయం 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై వెళుతుంది. ఈ రైలు తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. వాస్తవానికి విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళతాయి. విజయవాడ-చెన్నై వందేభారత్ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఏపీ మీదుగా ఇప్పటికే రెండు రైళ్లు నడుస్తున్నాయి.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఓ రైలు నడుస్తోంది. మరో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రారంభిస్తున్న రెండు రైళ్లు ఏపీ మీదుగా నడవనున్నాయి. కాచిగూడ యశ్వంత్‌పూర్ రైలు రాయలసీమలోని రైల్వే స్టేషన్ మీదుగా నడవనుంది.