అదృష్టం అంటే వీళ్లదే.. పోయింది అనుకున్న డబ్బులు, బంగారం మళ్లీ దొరికింది.. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నెల 18న విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ లక్ష్మయ్య ఎల్‌టీటీ–విశాఖపట్నం రైలులో ఎస్–1, బీ–4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తించారు. ఉదయం 5.10 గంటలకు రైలు భీమవరం టౌన్ దాటిన తరువాత బీ6 కోచ్‌లో బెర్త్‌లు తనిఖీలు చేస్తుండగా బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్‌పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గమనించారు. ఆ బ్యాగ్ గురించి తోటి ప్రయాణికులను ఆరా తీయగా.. భీమవరంలో స్టేషన్‌లో దిగిన కుటుంబానిది అని చెప్పారు. దీంతో విషయాన్ని ఆయన విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు.. బ్యాగులోని ఫోన్ రింగ్ అవుతుండటంతో తోటి ప్రయాణికుల సమక్షంలో మాట్లాడగా హ్యాండ్ బ్యాగు ట్రైన్‌లో మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. కోచ్‌లోని ప్రయాణికుల సమక్షంలో బ్యాగులో ఏముందో నిర్ధారించాల్సిందిగా చెప్పడంతో.. అందులో రూ. 40 వేల డబ్బు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. వాళ్లు చెప్పినట్లు అన్నీ సరిగా ఉండటంతో బ్యాగు బాధితురాలిదేనని నిర్ధారించారు.
సదరు మహిళ ఆ బ్యాగును రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని టీటీఐని కోరారు. దీంతో రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ ఆఫీసర్‌కు, జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. రైలు రాజమండ్రిలో ఆగిన తరువాత జీఆర్‌పీ పోలీసులు బాధితురాలి సోదరుడి నుంచి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో అంకితభావంతో వ్యవహరించి నిజాయితీ చాటుకున్న టీటీఐ లక్ష్మయ్యను రైల్వేశాఖ అధికారులు ప్రశంసించారు.. ఆయన్ను అభినందించారు. మరోవైపు బస్సులో పోగొట్టుకున్న పర్సును ప్రయాణికురాలికి అందించి ఆర్టీసీ కానిస్టేబుల్ తన నిజాయి తీని చాటుకున్నారు. గన్నవరం డిపో నుంచి హనుమాన్‌జంక్షన్ వెళ్లి 252 సర్వీస్ బస్సు బుధవారం రాత్రి తిరిగి గ్యారేజీలోకి వెళుతుండగా సెక్యూరిటీ గేటు దగ్గు బస్సు ఆపి ఆర్టీసీ కానిస్టేబుల్ ఎస్కేఎఫ్ రెహ మాన్ తనిఖీ చేశాడు. బస్సులో పర్సు కనిపించింది.. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. అప్పటికే పర్సు పోగొట్టుకున్న స్వప్నకుమారి ఆర్టీసీ సెక్యూరిటీ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు.
ఇంతలో పర్స్ డిపోలో ఉన్నట్లు తెలియడంతో.. ఆమె అక్కడికి వెళ్లారు. మహిళ దగ్గర టికెట్‌ను పరిశీలించి, లిఖితపూర్వకంగా ఆమెతో రాయించుకుని ఆ పర్సును రెహమాన్ చేతుల మీదుగా అందజేశారు. ఆ పర్సులో రూ.7వేలు ఉన్నాయి.. తన పర్సు తనకు అందించినందుకు ఆమె కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా వ్యవ హరించిన ఆర్టీసీ కానిస్టేబుల్ రెహమాన్‌ను అభినందించారు.