రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతోపాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతం నుంచి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభమవుతుందని శుక్రవారం ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ ఒకటో తేదీన కేరళలో ప్రవేశించి జూలై ఎనిమిదికి దేశమంతా విస్తరించాలి. తరువాత సెప్టెంబరు 17న రాజస్థాన్ నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలు కావాలి. అక్టోబరు 15 కల్లా దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాలి. అయితే ఈ ఏడాది జూన్ 8న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు జూలై 2 నాటికి అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈనెల 17న ఉపసంహరణ ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ వాయవ్య, ఉత్తర భారతంలో వర్షాలు కురుస్తున్నందున నిష్క్రమణ ఆలస్యమైంది.