తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన వయసులోనే వివాహం చేయాలని ,ఆలా కాకుండా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మంచి సంబంధాలు ఉన్నాయన్న ఆలోచనతో బాల్యవివాహాలు చేసి తమ బిడ్డల జీవితాలు ఇబ్బందులపాలు చెయ్యొద్దని కడప జిల్లా, చెన్నూరు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం కాబట్టి ఇందుకు ప్రభుత్వం రెండేళ్ల శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తుందన్నారు. ఇది చిన్నారుల తల్లిదండ్రులకు, ఆ పెళ్లికి సహకరించిన వారికి వర్తిస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన తరువాతనే అమ్మాయిల్లో శారీరక ఎదుగుదల బాగుంటుందని, అబ్బాయిల్లో 21 ఏళ్లు దాటిన తరువాత జీవితంలో ఎలా నడవాలన్న ఆలోచన ఉంటుందని తెలిపారు. వారి భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పక్కనబెట్టి చిన్న వయస్సులో వివాహాలు చేయరాదన్నారు.