బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. W ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ వైపు కదులుతుందన్నారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.. అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో 113.4 మిల్లీ మీటర్లు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 63.2, నెల్లూరు జిల్లా కందుకూరులో 45.2, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 41.2, విజయనగరం జిల్లా గంట్యాడలో 39.2, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 28.4, ఏలూరు జిల్లా కుక్కునూరులో 26, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 25.6, చిత్తూరు జిల్లా నగరిలో 24.8, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 24.6, విజయనగరం జిల్లా మెరకముడియంలో 23.4, నెల్లూరులో 22.8, అనకాపల్లి జిల్లా చోడవరంలో 22.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇవాళ ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అనంతరం క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది భావిస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడితే ఏపీలో వానలు కురుస్తాయంటున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. నూజివీడు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, ముసునూరు, పెదపాడు, లింగపాలెం, పెదవేగి, కామవరపుకోట, భీమడోలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రోడ్లు జలమయం అయ్యాయి. భీమడోలు, నూజివీడులో భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. ముసునూరు లోపూడిలో ఈదురుగాలులకు మామిడి చెట్టు కూలి రైతు చనిపోయాడు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం రాత్రి వరకు 22 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిండ్ర, పూతలపట్టు, వి.కోట, వెదురుకుప్పం, గుడిపాల, విజయపురం, నగరి, శ్రీ రంగరాజపురం, తవణంపల్లె, పెనుమూరు, సదుం, చిత్తూరు, కార్వేటినగరం, రామకుప్పం, గంగాధర నెల్లూరు, ఐరాల, శాంతిపురం, పాలసముద్రం, బైరెడ్డిపల్లి, పలమనేరులో వాన పడింది.