ఈ నెల 24న టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీలోని 14 మంది సీనియర్ నేతలతో రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఆ పార్టీ ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో నంద్యాలలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో భవిష్యత్ కార్యాచరణపై ఈ కమిటీ సమావేశం కానుంది. పొలిటికల్ యాక్షన్ కమిటీలోని సభ్యులైన యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెన్నాయుడు, ఎం.ఏ.షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా అనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు నంద్యాల రానున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కారణంగా ఆయన సమావేశానికి వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం మొదలుకానున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలను కొత్త పంథాలో నిర్వహించేలా, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా భవిష్యత్ కార్యాచరణపై కమిటీ సభ్యులు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.