విజయనగరం జిల్లా రాజాం వాసవీ నగర్‌లో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... శ్రీకాకుళం మండలం కరజాడకు చెందిన బలగ హరి బాబు బీటెక్(ఎలకా్ట్రనిక్స్) పూర్తి చేశాడు. ఢిల్లీ ప్రాంతంలోని గురుగామ్‌లో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశాడు. ఆపై హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ బెట్టింగులు ప్రారంభించి అప్పులపాలయ్యాడు. చెడు వ్యసనాలు ఎక్కువయ్యాయి. దీంతో ఉన్న ఉద్యోగం పోయింది. ఇదే సమయంలో ఆరోగ్యం సహకరించలేదు. దీంతో మరోమార్గం లేక ఇంటిబాట పట్టాడు. ఏం చేయాలో తోచక.. దొంగతనాలపై దృష్టి మళ్లించాడు. శ్రీకాకుళంలోని తన మేనత్త ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయాడు. అలాగే, హైదరాబాద్, విశాఖ, వరంగల్, శ్రీకాకుళం ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపాడు. గత నెల 23న జైలు నుంచి విడుదల య్యాడు. ఈ నెల 16న రాత్రి రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌లో ఉన్న వాసవినగర్‌లో ఓ ఇంట్లో చొరబడ్డాడు. అక్కడేమీ దొరక్క తిరిగి వచ్చేశాడు. మళ్లీ ఈ నెల 18న వినాయకచవితి రోజున వాసవినగర్‌లోని ఉపాధ్యాయుడు వెంకటరమణ ఇంట్లో బంగారం, నగదును చోరీ చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో బయటకు వెళ్లే ప్రయ త్నంలో మురుగుగుంటలో పడిపోయాడు. ప్యాంటు బురద అవ్వడంతో ఆ దుస్తులతో వెళ్తే ఎవరికైనా అనుమానం వస్తుందని భావించి మళ్లీ చోరీ చేసిన ఇంట్లోకి వెళ్లాడు. బురద ప్యాంటును అక్కడే వదిలేసి ఉపాధ్యాయుడు వెంకటరమణకు చెందిన ట్రాక్ ధరించి వెళ్లిపోయాడు. చోరీ చేసిన నగదుతో సెల్‌ఫోన్ కొనుగోలు చేశాడు. నాలుగు బంగారు గాజులు, ఓ హారాన్ని విశాఖలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టాడు. ఆ మొత్తంతో జల్సా చేస్తున్నాడు. చోరీ చేసిన ప్రదేశంలో విడిచిపెట్టిన ప్యాంటు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి హరిబాబును విశాఖలో పట్టుకున్నారు. అతని నుంచి రూ.50వేల నగదు, 150 గ్రాముల బంగారం, సెల్‌ఫోన్, రణస్థలంలో చోరీ చేసిన ద్వి చక్ర వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ఫైనాన్స్ సంస్థలో ఉన్న 90గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేయనున్నట్లు డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి తెలిపారు.