ఉత్పత్తి, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీ అతుల్ భట్ తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్ 41వ వార్షిక సమావేశం శుక్రవారం విశాఖలో నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, అన్ని యూనిట్లలో ఉత్పత్తి, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరుస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కేవలం రెండు బ్లాస్ట్ ఫర్నేసుల్లోనే ఉత్పత్తి జరిగిందన్నారు. చివరి త్రైమాసికంలో రూ.81 కోట్ల నగదు లాభాలు వచ్చాయన్నారు. ఫినిష్డ్, హైఎండ్ వాల్యూ యాడెడ్ స్టీల్ అమ్మకాలపై దృష్టి పెట్టామని చెప్పారు. వైర్ రాడ్ కాయిల్స్ అమ్మకాలను 60 లక్షల టన్నులు పెంచడంతో సంస్థ పనితీరు మెరుగుపడిందన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు నీరజ్ అగర్వాల్, డీకే మొహంతి, అరుణ్ కాంతి బాగ్చి, సురేశ్‌చంద్ర పాండే, సునీల్‌కుమార్ హి రానీ, ఘనశ్యామ్ సింగ్ పాల్గొన్నారు.