ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిప్‌స్టిక్, హెయిర్ కట్ చేసుకున్న మహిళలే వస్తారు.. దుమారం రేపుతున్న ఆర్జేడీ నేత వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 09:20 PM

మహిళా రిజర్వేషన్లపై తాజాగా ఆర్జేడీ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి దారి తీశాయి. తాజాగా పార్లమెంటు ఉభయసభలతోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన సందర్బంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ బారీ సిద్ధిఖీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రకారం లిప్ స్టిక్ పెట్టుకుని, బాబ్ హెయిర్‌కట్ చేసుకున్న మహిళలే రాజకీయాల్లోకి వస్తారని.. అలాంటి వారికే ఈ చట్టం ఉపయోగపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.


బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్-ఆర్జేడీకి చెందిన అబ్దుల్ బారీ సిద్ధిఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముజఫర్‌పూర్‌లో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అబ్దుల్ బారీ.. మహిళా రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతుల వారికి ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లులో కొంత కోటా ఇస్తే బాగుండేదని తెలిపారు. అయితే అంతటితో ఆగకుండా మరింత హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు. ఈ రిజర్వేషన్ల పేరుతో మహిళలు లిప్‌స్టిక్‌, బాబ్‌ హెయిర్‌కట్‌తో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన, అత్యంత వెనుకబడిన మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే బాగుండేదని అన్నారు.


దీంతో అబ్దుల్ బారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మహిళలను కించపరిచేలా అబ్దుల్ బారీ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. మహిళలపై అబ్దుల్ బారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆర్జేడీ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన వేళ అబ్దుల్ బారీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ రిజర్వేషన్ల వల్ల డబ్బు ఉన్న మహిళలే రాజకీయాల్లోకి వస్తారని.. పేదలు కూడా రావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.


మరోవైపు.. ఈ కార్యక్రమంలోనే ఆర్జేడీ కార్యకర్తలు, నేతలకు అబ్దుల్ బారీ కీలక సూచనలు చేశారు. టీవీలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఇదే విషయలో వారితో ప్రమాణం కూడా చేయించారు. టీవీలు, సోషల్ మీడియాలో మునిగిపోతే జీవితం సాగించలేరని.. చదువు కూడా ఒంటబట్టదని పేర్కొన్నారు. కనీసం వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల వరకైనా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అబ్దుల్ బారీ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa