విజయవాడ దుర్గగుడిలో దసరా మహోత్సవాలలో ఆర్జిత సేవలు, వాటి రుసుముల వివరాలను ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలలో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116గా నిర్ణయించారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పూజలలో పాల్గొనే భక్తులకు చీర, ధోవతి, పెద్ద లడ్డు, అమ్మవారి ఫొటో, శ్రీ చక్రపీఠం, కుంకుమ ఇస్తారు. ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3000, మూలా నక్షత్రం నాడు రూ. 5000 రుసుం చెల్లించాలన్నారు. తొలిరోజు ఉదయం 11 నుంచి 12 వరకు, మిగిలిన రోజుల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి 10 నుంచి 12 గంటల వరకు పూజలు ఉంటాయి.
శ్రీ చక్రనవావరణార్చనకు రూ. 3000, ప్రత్యేక శతచండీ యాగానికి రూ. 4000 రుసుం నిర్ణయించారు. తొమ్మిది రోజులకుగాను రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 23వ తేదీ నగరోత్సవం అనంతరం అమ్మవారి జలవిహారం (తెప్పొత్సవం) జరగనుంది. ఆదివారం దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. క్యూలలో భక్తులను ఈవో నియంత్రించారు. లోక క్షేమం కోసం వేదపండితులు ఆరుణ పారాయణ, సూర్య నమస్కారాలు చేశారు. అలాగే భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.
మరోవైపు ఆదివారం రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ దుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబ బదిలీ అయ్యారు. డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన్ను తొలుత ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో)గా నియమించారు. అయితే ఆయన ఆ పోస్టులో చేరలేదు.. ఇప్పుడు కనకదుర్గ ఆలయం ఈవోగా నియమించారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న భ్రమరాంబను దేవదాయశాఖ మరోచోటకు బదిలీ చేయనున్నారు. మరో నలుగురు డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేశారు.