విమానం గాల్లో ఉండగా అస్వస్థతకు గురైన ఓ చిన్నారికి.. తోటి ప్రయాణికులు ప్రథమ చిక్సిత్స అందించి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన రాంచీ- ఢిల్లీ ఇండిగో విమానంలో శనివారం చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆరు నెలల పాప పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఉంది. ఆ పాపను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు శనివారం రాంచీ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే పాపకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే, అదృష్టవశాత్తూ అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వైద్యులు తక్షణమే స్పందించారు. ఐఏఎస్ అధికారి, ఝార్ఖండ్ గవర్నర్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి, రాంచీ సదర్ ఆసుపత్రికి చెందిన మరో వైద్యుడు మొజామిల్ ఫిరోజ్‌లు కలిసి ప్రాథమిక చికిత్స చేపట్టారు. విమానంలో పెద్దలకు పెట్టే ఆక్సిజన్ మాస్కుతో చిన్నారికి ప్రాణవాయువును అందించారు. తల్లిదండ్రులు దగ్గరున్న ఔషధాల కిట్‌లో నుంచి ఓ ఇంజెక్షన్ తీసి చేశారు. కొద్దిసేపటికి పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అనంతరం ఓ గంట తర్వాత విమానం ఢిల్లీకి చేరుకోగా.. అక్కడి వైద్య బృందం పాపకు చికిత్స ప్రారంభించింది.
‘బిడ్డ ఊపిరి పీల్చుకోకవడంతో తల్లి ఏడుస్తోంది... నేను, డాక్టర్ మొజామిల్ పాప సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాం.. మాస్క్ లేదా కాన్యులా అందుబాటులో లేనందున పెద్దల మాస్క్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం.. మేము వైద్య రికార్డులను పరిశీలించగా ఆ శిశువుకు జన్మతః వచ్చే పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ (PDA)తో బాధపడుతోన్న తెలిసింది. చికిత్స కోసం ఆ పాపను ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నారు’ అని నితిన్ కులకర్ణి చెప్పారు.
ఔషధాల కిట్‌లో ఉన్న థియోఫిలిన్ అనే ఇంజక్షన్ ఇచ్చామని, తల్లిదండ్రులు డెక్సోనా ఇంజెక్షన్‌ను తీసుకొచ్చారని, ఇది చాలా ఉపయోగపడిందని అన్నారు. ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందించిన తర్వాత పాప హృదయ స్పందనలను స్టెతస్కోప్‌తో పరీక్షించగా మెరుగైనట్టు సంకేతాలను చూపించింది. ఆక్సిమీటర్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అంచనా వేయడం కష్టమైందని డాక్టర్ కులకర్ణి అన్నారు. ‘మొదటి 15-20 నిమిషాలు చాలా కీలకమైనవి.. ఒత్తిడితో కూడుకున్నవి.. పురోగతిని అంచనా వేయడం కష్టం. చివరకు కళ్లు సాధారణంగా తెరుచుకుని, శిశువు కూడా శబ్దాలు చేసింది.. క్యాబిన్ సిబ్బంది కూడా సహకరించారు.. తక్షణమే స్పందించడంతో పాప మళ్లీ ఊపిరి పీల్చుకుంది’ అని పేర్కొన్నారు.
అదే విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి వైద్యులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘వైద్యులు దేవదూతలు.. ఈరోజు ఇండిగో విమానంలో ఒక 6 నెలల పాపను రక్షించడం నేను చూశాను.. ఐఏఎస్ డాక్టర్ నితిన్ కులకర్ణి ఝార్ఖండ్ గవర్నర్ ముఖ్య కార్యదర్శి.. వైద్యుడిగా తన పాత్రను పోషించి చిన్నారిని రక్షించారు. మీకు సెల్యూట్ సార్’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.