రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్‌సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైయస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్ తుపాన్‌లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది. అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది.