ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైల్లో ఉన్నా.. చంద్రబాబు దృఢంగా ఉన్నారు: భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 06:47 PM

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని నారా భువనేశ్వరి అన్నారు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు.. రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెపుతుండేవారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుంది’ అని రైతులతో అన్నారు.


ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని రైతులు.. భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిందని వారు అన్నారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని రైతులు అన్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, ఇబ్బందులు గురిచేసిందని ఆరోపించారు. తనకు అన్నీ తెలుసని, రైతులు ధైర్యంగా నిలబడాలని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు బయటకొస్తారని, మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు.


రాజధాని విధ్వంసం కంటే, చంద్రబాబును జైల్లో పెట్టిన ఘటనే తమకు ఎక్కువ బాధ కలిగించిందని రైతులు అన్నారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. భువనేశ్వరి వారిని ఊరడించారు. అమరావతి నుంచి మంగళవారం (అక్టోబర్ 3) ఉదయం రాజమహేంద్రవరం బయల్దేరిన తమను పోలీసులు అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు. వీరవల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారని మహిళలు, రైతులు భువనేశ్వరికి తెలిపారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినా కనికరించలేదని అన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్తున్నామని చెప్పిన తర్వాతే తమను అనుమతించారని పేర్కొన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేందుకు పోలీసులు తమను అనుసరించారని చెప్పారు. ‘అమరావతి ఉద్యమం నాటి నుంచి ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తూనే ఉంది. చంద్రబాబుపై నమ్మకంతోనే మా భూములు రాజధానికి ఇచ్చాం. 3 రాజధానుల నిర్ణయంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమవడమే కాకుండా, రాష్ట్ర ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు’ అని రైతులు భువనేశ్వరితో అన్నారు.


మందడంలో రామకోటి స్తూపాన్ని నిర్మిస్తున్నామని తెలిపిన రైతలు.. రామకోటి రాసే పుస్తకాన్ని భువనేశ్వరికి అందించారు. ‘ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి, ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని కోరుతున్నా. మీరంతా అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ రాక మాకు బలాన్ని చేకూర్చుతోంది. వారు అడ్డదారిలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఈ ప్రభుత్వానికి మహిళల శక్తి తెలియడం లేదు. చంద్రబాబు జైల్లో ఉన్నా మానసికంగా దృఢంగా ఉన్నారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. చంద్రబాబు మచ్చలేకుండా బయటకు వస్తారు’ అని భువనేశ్వరి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com