తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగుప్రయాణంలో కిడ్నాప్‌కు గురైన రెండేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సుమారు 7గంటల్లోనే దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులు మోగన వసంత్ (8), అరుల్ మురుగన్ (2)తో కలిసి ఆదివారం తిరుమలకు వచ్చారు. దర్శనమయ్యాక తిరిగి చెన్నైకి వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి తిరుపతి బస్టాండుకు చేరుకున్నారు. చెన్నైకి వెళ్లే బస్సులు రద్దీగా ఉండటంతో బస్టాండులోనే నిద్రపోయారు. 2.12 గంటల సమయంలో ఓ ఆగంతకుడు అరుల్ మురుగన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. 2.20 గంటల సమయంలో నిద్రలేచిన మీనా చిన్న కుమారుడు పక్కన లేకపోవడాన్ని గుర్తించి బస్టాండులో వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు జిల్లా అంతటా అలర్ట్ ప్రకటించి వాహనాల తనిఖీ ప్రారంభించారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తూ కిడ్నాపర్ వెళ్లిన మార్గాన్ని అంచనా వేస్తూ ఓ బృందం కోడూరుకు, మరో బృందం తమిళనాడుకు బయలుదేరి వెళ్లింది. మరికొందరు జిల్లాలో గాలించారు. ఈ సమయంలోనే ఏర్పేడు సమీపంలోని మాధవమాలకు చెందినఽ ధనమ్మ (45) కిడ్నాపైన బాలుడితో స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు అప్పగించారు. ఽతన తమ్ముడైన అవిలాల సుధాకర్ (38) బాలుడిని వేకువజామున 3 గంటల సమయంలో తన ఇంటికి తీసుకొచ్చి స్నేహితుని కుమారుడని చెప్పి వెళ్లినట్టు ఆమె పోలీసులకు వివరించింది. బాలుడి కిడ్నాప్ ఉదంతాన్ని మీడియాద్వారా తెలుసుకున్న గ్రామ సర్పంచి జరీనాబేగం మంగళవారం ఉదయం ధనమ్మ ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని గుర్తించి అడగడంతో విషయం వెలుగుచూసింది. తన కుమారుడు కరీముల్లాతో ధనమ్మను, చిన్నారిని స్టేషన్‌కు పంపించింది. అనంతరం ఎస్పీ పరమేశ్వర రెడ్డి చిన్నారిని తిరుపతికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన అక్క ధనమ్మతో పాటు తనకు కూడా పిల్లల్లేకపోవడంతోనే ఈ కిడ్నాప్ చేసినట్లు సుధాకర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది.