ఏపీలో కొందరు వాలంటీర్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లబ్దిదారుల పింఛన్లు నొక్కేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో కూడా అదే జరిగింది.ఓ దివ్యాంగుడి పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఘటన బయటపడింది. కుప్పం మండలం క్రిష్ణదాసనపల్లికి చెందిన శ్రీధర్ దివ్యాంగుడు. సెప్టెంబర్‌లో రూ. 3వేల పింఛన్ మంజూరైన విషయం తెలిసింది.. ఈ విషయాన్ని గ్రామ వాలంటీర్ బాలాజీని దివ్యాంగుడు ప్రశ్నించాడు. పింఛన్ మంజూరైందని.. వేలిముద్ర తీసుకుని డబ్బులు మాత్రం ఇవ్వలేదని శ్రీధర్ చెబుతున్నారు. పింఛన్ డబ్బులపై ప్రశ్నించినా సమాధానం దాటవేసినట్లు బాధితుడు చెప్పారు.
అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్ సొమ్ము ఇవ్వాలని సచివాలయానికి తాను వెళ్లానని.. అక్కడ వాలంటీర్ బాలాజీ వేలిముద్ర వేయించుకొని.. పై అధికారులకు రూ. 1500 నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు శ్రీధర్. చివరికి రూ. 1000 ఇచ్చి.. మిగిలిన సొమ్ము తీసుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు బాధితుడ్ని తీసుకుని గ్రామ సచివాలయానికి వెళ్లి వాలంటీర్‌పై ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌కు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఎంపీడీవో స్పందించారు. గ్రామ వాలంటీరు పింఛన్ డబ్బులు తీసుకున్న విషయం మొబైల్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.