రాష్ట్రంలో ఎన్‌సీసీ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుగు రాష్ట్రాల ఎన్‌సీసీ గ్రూప్ డిప్యూటీ కమాండర్ వీఎం రెడ్డి తెలిపారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 12 రోజుల నుంచి జరుగుతున్న నవసైనిక్ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడుతూ అకాడమీ ఏర్పాటుకు కావాల్సిన 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం జగన్, సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఈ నిర్మాణ పనులకు రూ.25 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. పనులు పూర్తయితే ఎన్‌సీసీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో కేడెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలుంటుందన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో 65 ఎన్‌సీసీ యూనిట్లు ఉన్నాయన్నారు. ఏటా లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో మరో లక్ష సీట్లను పెంచుతున్నామని తెలిపారు.