రాష్ట్రంలోని మున్సిపల్, నగర పంచాయతీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కింద తీసుకొచ్చిన క్లాప్ విధానం కాంట్రాక్టర్లకు కాసుల కురిపించేలా, వాహనాల డ్రైవర్ల పొట్ట కొట్టేలా ఉందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు ఆరోపించారు. ఆదివారం క్లాప్ వాహన డ్రైవర్లతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ క్లాప్ వాహనానికి క్లీనర్‌ను నియమించాల్సి ఉన్నా.. నియమించకుండానే జీతాలను స్వాహా చేస్తున్నారన్నారు. డ్రైవర్లకు వేతనం రూ.12 వేలు చెల్లించకుండా రూ.8 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఒక్క వాహనం నిర్వహించేందుకు క్లాప్ సంస్థ మున్సిపల్‌శాఖ నుంచి రూ.63 వేలు వసూలు చేస్తోందని, వాటి రిపేర్లు కూడా కార్మికుల వేతనాల నుంచి ఖర్చు చేస్తున్నారని వాపోయారు. జీతాల నుంచి కమీషన్లను వసూలు చేస్తున్న క్లాప్ ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.