భారత రాజ్యాంగం దాని అనుబంధ వ్యవస్థల గురించి ప్రజల్లో చైతన్యం పెరగడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు అన్నారు. ఆదివారం గుంటూరులో రాజ్యాంగ చర్చా వేదిక ఆవిర్భావసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పౌరులకు సంబంధించి ప్రాథమిక హక్కులు, న్యాయం, అభివృద్ధి ముఖ్యంగా పరిపాలన గురించి విశేషంగా చర్చించినట్టు వివరించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్ధాలు గడిచినా సామాన్య ప్రజల్లో రాజ్యాంగం పట్ల నేటికీ పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. అన్ని సమస్యలకు కోర్టులే పరిష్కారం అన్న అపోహలను విడనాడాలని సూచించారు. చట్టం పట్ల ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.