ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ను కట్టడి చేయాలని మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ ఎన్నికల సమరాంగణానికి సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ విడుదలవడం తెలిసిందే. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు కాస్త మొగ్గు ఎక్కువగా ఉందని ఆ సర్వే పేర్కొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఇలాంటి ప్రీ పోల్ సర్వేలు సందడి చేస్తున్నాయి. దీనిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. నవంబరు, డిసెంబరు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియర్ సర్వేలపై నిషేధం విధించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాన మీడియా స్రవంతిలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ను కట్టడి చేయాలని తెలిపారు. ఇలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.