రెండేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యాపారి వాలెట్ నుంచి రూ.4.5 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ చోరీకి గురైన వ్యవహారంపై పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో నగదు బదిలీ అయిన కొన్ని వాలెట్ IDలను పోలీసులు గుర్తించినా.. చివరికి ఆ డబ్బు చేరిన వ్యక్తిని ట్రాక్ చేయడం కష్టంగా కనిపించింది. ఆ సమయంలో ఇజ్రాయేల్ గూఢచార సంస్థ మొస్సాద్ సాయం కోరింది. సాధారణ గూఢచర్య మార్పిడిలో భాగంగా నిధుల కోసం తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న కొన్ని అనుమానిత వాలెట్ల గురించి మొస్సాద్ సమాచారం ఇచ్చింది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మిలిటరీ వింగ్ (అల్-కస్సామ్ బ్రిగేడ్స్) సైబర్ మాడ్యూల్ బయటపడింది.
టెక్నాలజీని ఉపయోగించి క్రిప్టో వాలెట్ల నుంచి డబ్బులను ఆ సంస్థ డిజిటల్ వాలెట్లకు అక్రమంగా బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ బదిలీ అయిన అనేక వాలెట్లు హమాస్ సైబర్ తీవ్రవాద విభాగం నిర్వహిస్తోన్నట్టు విచారణలో తేలింది. తాజాగా, ఇజ్రాయేల్ మిత్ర దేశాల బ్యాంకులు, ఆర్ధిక సంస్థలపై సైబర్ దాడితో నిధులను సేకరించేందుకు హమాస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. హమాస్‌కు నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తోన్న పెద్ద సంఖ్యలో క్రిప్టోకరెన్సీ ఖాతాలను ఇజ్రాయెల్ పోలీసుల సైబర్ విభాగం స్తంభింపజేసింది.
హమాస్ తాజా ఉగ్రదాడులు ప్రారంభమైన తర్వాత క్రిప్టో నిధుల సేకరణ ప్రయత్నం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వారి ఖాతాల నుంచి స్వాధీనం చేసుకున్న నిధులను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయాలని ఇజ్రాయేల్ అధికారులు క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్‌ను కూడా కోరారు. కాగా, ఢిల్లీలో జరిగిన క్రిప్టోకరెన్సీ చోరీ.. భారత్‌లో హమాస్ కార్యకలాపాలకు మొదటి ఉదాహరణ. ఆ సమయంలో విచారణ వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేశామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. మాజీ డీసీపీ (స్పెషల్ సెల్) కేపీఎస్ మల్హోత్రా బృందం ఈ కేసును దర్యాప్తు చేసింది. మా దర్యాప్తులో హమాస్ సైబర్ వింగ్ అల్ కస్సామ్ బ్రిగేడ్‌లకు సంబంధించిన అనేక వాలెట్‌లను గుర్తించామని మల్హోత్రా మంగళవారం ధ్రువీకరించారు.
ఈ విషయంపై మొదట 2019లో పశ్చిమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. కోర్టు ఆదేశాలపై స్పెషల్ సెల్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు, హమాస్ లింక్ బయటపడిన తర్వాత స్వాధీనం చేసుకున్న వాలెట్లలో ఒకటి గాజాలోని నసీర్ ఇబ్రహీం అబ్దుల్లా, గిజాలోని అహ్మద్ మర్జూక్, పాలస్తీనాలోని రమల్లాలో అహ్మద్ క్యూహెచ్ సఫీ వంటి హమాస్ కార్యకర్తలకు చెందినవని సాంకేతిక విశ్లేషణలో వెల్లడయ్యింది. ‘క్రిప్టోకరెన్సీ నిధులను వివిధ వాలెట్ల ద్వారా మళ్లించి.. చివరకు ఈ అనుమానిత వాలెట్లలోకి చేరాయి’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.