గతవారం పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడుల తర్వాత గాజాపై ఇజ్రాయేల్ దాడి తీవ్రమైంది. యుద్ధం నాలుగో రోజులోకి ప్రవేశించగా.. ఇప్పటి వరకూ 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కుటుంబాలు తమ ప్రియమైన వారిని పొగొట్టుకుని దుఃఖంలో ఉన్నాయి. గాజాను దిగ్బంధించి.. హమాస్ ముష్కరులను అంతం చేయడానికి ఇజ్రాయేల్ చేపట్టిన ఆపరేషన్‌లో అమాయకులు బలైపోతున్నారు. అటు, ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్ క్రూరత్వానికి బలైపోయిన కన్నీటి కథలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా, భారతీయ మోడల్, నాగిని సీరియల్ నటి మధుర నాయక్ సోదరి ఒడయా, ఆమె భర్తను హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. వారి పిల్లల ముందే తన సోదరి, ఆమె భర్తను పాశవికంగా హత్యచేశారని మధుర నాయక్ కన్నిటీ పర్యంతమైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన ఆమె.. ‘నా కుటుంబం ఎదుర్కొంటున్న బాధ, ఆవేదనను మాటల్లో చెప్పలేను.. ఇజ్రాయేల్ వీధులు హమాస్ ఆగ్రహంతో మంటల్లో కాలిపోతున్నాయి... మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలహీనులను లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది.
మధుర తన సోదరి ఒడయాతో ఉన్న ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘పాలస్తీనా అనుకూల ఎజెండా ఎంత బలంగా నడుస్తుందో ఇది చూపిస్తుంది.. ఒక యూదునిగా వేధింపులను, తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నాను’ అని వాపోయారు. ఒడయా, ఆమె కుటుంబం కథ ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్-హమాస్ రక్తపాత యుద్ధంలో క్రూరత్వానికి ఉదాహరణ. ప్రస్తుతం జరుగుతోన్న మారణహోమంలో చాలా మంది పిల్లలు అనాథలుగా మారారు. ఎడతెగని రాకెట్ దాడులు.. ప్రతిగా వైమానిక దాడులతో అనేక మంది మరణించారు. మరణం, భయం, యుద్ధం ఇరువైపులా ఆవహించింది. మరోవైపు, హమాస్ నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది.