లులు మాల్లో త్రివర్ణ పతాకం కంటే పెద్ద పాక్ జెండాను ఏర్పాటుచేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన కేరళలోని కొచ్చి లులు మాల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యాదృచ్చికంగా భారత్లో ప్రపంచ కప్ క్రికెట్ జరుగుతున్న సమయంలో అన్ని దేశాల జెండాలను లులు మాల్లో ఏర్పాటుచేశారు. అయితే చాలా జెండాలు సాపేక్షంగా సమాన పరిమాణంలో ఉండగా.. భారత త్రివర్ణ పతాకానికి ఆనుకుని మాత్రం అతిపెద్ద పెద్ద పాకిస్థానీ జెండాను ఉంచారు.
ఇది పూర్తిగా భారతీయ జెండా నిబంధనలు ఉల్లంఘించడమే. నిబంధనల ప్రకారం.. భారత జాతీయ జెండా పైన ఏ జెండాను ఉంచకూడదు. త్రివర్ణ పతాకం భారతదేశానికి గర్వకారణం. అందుకే ప్రతీ భారతీయుడు జాతీయ జెండాను ఎంతో గర్వంగా ఎగురవేస్తారు. జాతీయ జెండాకు సంబంధించి చట్టంలో ప్రత్యేకంగా నియమ, నిబంధనలు పేర్కొన్నారు. ఎవరైనా సరే ఆ నియమ, నిబంధనల పాటించాలి. ఈ నిబంధనలను లులు మాల్లో ఉల్లంఘించారని నెటిజన్లు మండిపడుతున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను పలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తూ.. ఈ ప్రదర్శనపై పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు, జాతీయ జెండాను అవమానించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై లులు మాల్ స్పందించింది. క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా వేలాడదీసిన జెండాలకు సంబంధించిన ప్రచారాలు నకిలీవని ఆ గ్రూప్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా కొచ్చి లులు మాల్లో టోర్నీ ప్రారంభం రోజున ఆయా దేశాల జెండాలను ఎగురవేశామని తెలిపింది. దీనిపై జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని, వాస్తవాలు అర్థం కావడం లేదని లులూ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కానీ, నెటిజన్లు మాత్రం లులు తీరును తప్పుబడుతున్నారు. పాక్ జెండాను త్రివర్ణ పతాకం కంటే పెద్దదిగా ఏర్పాటుచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.