కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న మహిళ మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కేసు నమోదు చేసిన ఎస్సై విశ్వనాథ్ మాట్లాడుతూ..... పార్ట్‌టైం జాబ్ కావాలంటే తాము పంపిన యూట్యుబ్ లింక్‌ను సబ్‌స్ర్కైబ్ చేయాలని, ఇలా చేస్తే రూ. 50 వస్తాయని యువతి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. దాంతో యువతి ఓకే చేయగా రెండుసార్లు రూ. 50 వచ్చాయి. మీరు నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లాలంటే కొంత డబ్బు చెల్లించాలని, అలా చెల్లిస్తే డబుల్ పేమెంట్ వస్తుందన్నారు. దాంతో రూ. వెయ్యి జమచేస్తే రూ.1,600 ఒకసారి, రూ.5వేలు జమచేస్తే రూ. 10వేలు యువతికి పంపించారు. ఆ తరువాత రూ.22 వేలు పంపాలని మెసేజ్ రావడంతో రూ. 22 వేలు, 33వేలు, రూ. 50 వేలు, రూ. లక్ష ఇలా వారు కోరినట్టుగా 15 రోజుల్లో రూ.7.50 లక్షలను యువతి ఆన్‌లైన్ కేటుగాళ్లకు పంపిందని ఎస్సై తెలిపారు. ఆ తరువాత యువతికి సరైన సమాధానం రాకపోవటంతో అకౌంట్ బ్లాక్ అయిందని, దీంతో తాను మోసపోయానని యువతి గ్రహించిందని తెలిపారు.