ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు మాజీమంత్రి నారాయణకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే నోటీసులను రద్దు చేయాలని కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు మూసివేసింది. పిటిషనర్‌ను తన ఇంటి వద్దే, న్యాయవాది సమక్షంలో విచారించాలని పేర్కొంది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ఆదేశాలిచ్చారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా సీఐడీ తరఫున అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నోటీసులో పేర్కొన్న గడువు తేదీ ముగిసిన నేపథ్యంలో వ్యాజ్యం నిరర్ధకం అయిందన్నారు. తాజాగా నోటీసు జారీ చేసిన పక్షంలో నిబంధనలు పాటిస్తామని చెప్పారు.