పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజరు చేతివాటం బయటపడింది. బ్యాంకులో ఖాతాదారులకు తెలియకుండా వారి పేరిట రుణాలు మంజూరు చేసి రూ.25.62 లక్షలు మోసానికి పాల్పడిన ఘటన బయటపడింది. బందన్ బ్యాంకు నరసాపురం శాఖ మేనేజరుగా మోర్త శ్రీకృష్ణ పనిచేస్తున్నారు. లక్ష్మణేశ్వరంలోని స్వామి గ్రూపులో ముగ్గురు సభ్యులకు గత నెల 22న రూ.1.10 లక్షలు రుణం పొందినట్లు వారి మొబైల్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. తాము రుణాలు తీసుకోవడం ఏంటని అదే రోజు బ్యాంకుకు వచ్చి మేనేజరును ప్రశ్నించారు. బ్యాంకు ఏరియా మేనేజరు మల్లిక్ అహ్మద్‌నూర్ బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మేనేజరును నిలదీయగా ఆ సొమ్ము తానే తీసుకున్నట్లు అంగీకరించి తిరిగి చెల్లించారు. బ్యాంకులో ఇలా ఇంకా ఏవైనా రుణాలు తీసుకున్నారా అని పరిశీలించగా బ్రాంచి మేనేజరు పలువురి పేరిట రూ.25.62 లక్షలు రుణాలు మంజూరు చేసి ఆ డబ్బుల్ని కాజేసినట్లు గుర్తించారు. ఏరియా మేనేజరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.