టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట మాజీ మంత్రి ప్రత్యక్షమయ్యారు. మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీలో ఉన్న సదరు నేత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలతో టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారేమో.. టీడీపీ నేతలతో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు అనుకుంటున్నారా.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన తాజాగా నారా లోకేష్‌తో పాటూ గన్నవరం ఎయిర్‌పోర్టులో కనిపించారు. టీడీపీ నేతలతో కలిసి బయటకు వస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది.
కొత్తపల్లి సుబ్బారాయుడు కొంతకాలంగా ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తున్నారు.. నారా లోకేష్‌తో పాటుగా నరసాపురం ఎంపీ రఘురామతో ప్రత్యక్షమయ్యారు. దీంతో కొత్తపల్లి మళ్లీ టీడీపీలోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా ప్రచారం జరిగింది.. తెలుగు దేశంలో చేరడం ఖాయమన్నారు. కానీ ఆయన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. వేచి చూసే ధోరణిలో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు నరసాపురం నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్నామని సంకేతాలు పంపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పార్టీ ఇంఛార్జ్ పొత్తూరు రామరాజులు పోటీలో ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా వస్తే వర్గపోరు తప్పదనే వాదనలు ఉన్నాయి. ఆయన మాత్రం ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
సుబ్బారాయుడు ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌పైనా స్పందించారు. చంద్రబాబు అరెస్టు ఉద్దేశపూర్వకంగా, కక్ష పూరితంగా జరిగిందన్నారు. అరెస్టు తీరు తెలుగు ప్రజలను కలిచివేసిందని.. అరెస్టు ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదన్నారు.జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని.. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలపటం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటన టీడీపీ, జనసేన వర్గాలలో ఉత్సాహాన్ని నింపాయని కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు.
అంతేకాదు నరసాపురంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఆయన నివాసం నుంచి వందలాది మోటార్ సైకిళ్లతో కొత్తపల్లి ర్యాలీగా వచ్చారు. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఉప్పెనలా మద్దతు లభిస్తోందని.. తాటాకు చప్పుళ్ళకు చంద్రబాబు బెదిరే రకం కాదన్నాు. అక్రమంగా అరెస్టు చేయించిన వారికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది.
కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ నుంచి నర్సాపురం నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే గెలుపొందారు.. అంతేకాదు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో సుబ్బారాయయుడు 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో కండువా కప్పుకున్నారు. నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
కొత్తపల్లి సుబ్బారాయుడు 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి మాధవనాయుడు చేతిలో ఓడిపోయారు. ఆయన మళ్లీ తిరిగి టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు చంద్రబాబు. సుబ్బారాయుడు 2019 ఎన్నికలకు ముందు మళ్లీ ఆ పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగారు.. కానీ ఆ తర్వాత నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో విభేదాలతో కొత్తపల్లి వైఎస్సార్‌సీపీకి దూరం జరిగారు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు కొత్తపల్లి కచ్చితంగా 2024లో పోటీ చేస్తానని తేల్చి చెబుతున్నారు.. మరి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa