ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..... ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఎప్పుడు చనిపోయారో, చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి వివాహం ఎప్పుడు జరిగిందో తెలియకుండానే నారాయణస్వామి మతిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని చంపిన వ్యక్తినే భువనేశ్వరి పెళ్లి చేసుకున్నారని నారాయణస్వామి ఎలా మాట్లాడుతారన్నారు. ఎన్టీఆర్ మరణించింది 1996లో అయితే, చంద్రబాబు, భువనేశ్వరి వివాహం 1981లో జరిగిందన్నారు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండానే నారాయణ స్వామి మతిలేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.