ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రస్తుతం భీకర యుద్ధం సాగుతోంది. ఇరు వైపులా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మొదట ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడికి వ్యతిరేకంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. అన్ని వైపుల నుంచి గాజాను దిగ్భందించి.. భారీగా దాడులు చేస్తోంది. ఇక హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ చెప్పిన వాదనను సమర్థించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో పర్యటించారు. బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్ ఎర్జోగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో బైడెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు దుర్మార్గాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఆత్మరక్షణ కోసం హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యావత్ ప్రపంచానికి చెప్పడానికే తాను ఇజ్రాయెల్‌లో పర్యటించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హమాస్ మిలిటెంట్లపై బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారని.. వారు ఐసిస్ ఉగ్రవాదుల లాంటి వారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ సంస్థ ప్రాతినిధ్యం వహించడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బైడెన్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం.. పాలస్తీనా వాసులకు తీవ్రమైన బాధను మిగిల్చిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇప్పటివరకు 1400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వారికి బైడెన్ సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌లో పర్యటించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఇక సెంట్రల్ గాజాలోని అహ్లీ అరబ్ ఆస్పత్రిపై జరిగిన భారీ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ ఆరోపిస్తుండగా.. ఇది ఉగ్రవాదుల పనేనని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ చెప్పిన వాదనను బైడెన్ సమర్థించారు. మరోవైపు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా త్వరలోనే ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఇప్పటివరకు బ్రిటన్ ఈ ప్రకటన చేయలేదు.