రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి.. సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లభించడం లేదు. తాజాగా పాకిస్థాన్ నేషనల్ ఎయిర్‌లైన్స్.. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలోనే కనీసం విమానాలకు ఇంధనం కొనేందుకు కూడా డబ్బులు లేని దీన పరిస్థితిలో చిక్కుకుంది. అటు.. చమురు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని పెట్టుకున్న మొరను పాక్‌లో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విమాన సర్వీసులను రద్దు చేయాల్సిన దుస్థితి వచ్చింది.
పాక్ ప్రభుత్వంలో పనిచేసే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తీవ్ర ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే చమురు లేక విమానాలు నిలిచిపోయాయి. మంగళ, బుధ వారాల్లో ఏకంగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 48 విమానాలు రద్దయ్యాయి. వీటితోపాటు మరిన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 విమానాలను రద్దు చేశారు. వాటిలో 11 ఇంటర్నేషనల్, 13 డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. బుధవారం కూడా మరో 24 విమానాలు.. అందులో 16 ఇంటర్నేషనల్, 8 డొమెస్టిక్ సర్వీసులను రద్దు చేసినట్లు పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
విమానాలకు రోజువారీగా సరిపడే ఇంధనం సరఫరాలో కొరత ఏర్పడటం, నిర్వహణ కారణలతోనే విమానాలను రద్దు చేసినట్లు పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరికొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసినట్లు స్పష్టం చేసింది. ఇక రద్దు చేసిన 48 విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో వారి గమ్యస్థానాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. దివాలా అంచున ఉన్న పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. నిర్వహణ ఖర్చుల కోసం 23 బిలియన్ పాకిస్థానీ రూపాయలు ఇవ్వాలని పాక్‌లో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ సంస్థ చేసిన అభ్యర్థనను పాక్ కేర్ టేకర్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రోజు వారీ ఇంధనం కోసం పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. పాక్ స్టేట్ ఆయిల్ సంస్థకు 100 మిలియన్ పాకిస్థానీ రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అడ్వాన్స్ చెల్లింపులు లేకుండా ఇంధనాన్ని సరఫరా చేయడం కుదరదని పాక్ స్టేట్ ఆయిల్.. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు స్పష్టం చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్స్.. పెండింగ్ బకాయిలను కూడా చెల్లించలేకపోయింది. దీంతో పీఎస్‌వో ఇంధన సరఫరాను నిలిపివేయడంతో విమానాలు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భవిష్యత్‌లో ఇదే సమస్యతో మరిన్ని విమానాలు కూడా రద్దు చేసే అవకాశముందని ఎయిర్‌లైన్స్ వర్గాలు చెబుతున్నాయి.