ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా.. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే.. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావటంతో.. వారి అభ్యర్థనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. అన్ని విభాగాలలోని ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించిన జీఏడీ.. మరో 212 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. మరోవైపు.. ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా పండుగ వేళ జగన్ సర్కార్ తీపి కబురు వినిపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ బిల్లుకు గెజిట్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. కాగా.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.