తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయంలో వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించింది. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ంర ఉత్తర్వులను రద్దు చేసింది. ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుpower పంపిణీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం 65 పేజీల తీర్పు వెల్లడించింది.
ఈ వివాదం రెండు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో నడుస్తున్న సంస్థలకు సంబంధించినదని అభిప్రాయపడింది. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం అవసరమని వ్యాఖ్యానించింది. బకాయిలు రూ.3,441.78 కోట్లు, చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు సర్‌ఛార్జి తదితరాలకు రూ.3,315.14 కోట్లు.. మొత్తం రూ.6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను కొట్టివేసింది. గత ఏడాది ఆగస్టు 29న కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఏవైనా వివాదాలు తలెత్తితే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలోని నిబంధనల ప్రకారం మొదట చర్చలతో.. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు ఏపీఈఆర్‌సీని సంప్రదించవచ్చని.. అంటే రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ సంస్థ ఉన్నట్లేనని అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం.. వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయ సంస్థను ఆశ్రయించకుండా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 కింద నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు.
అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే పరిష్కారం కోసం సబ్ కమిటీ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేసింది ధర్మాసనం. అలాగే బకాయిలను సర్దుబాటు చేయరాదని.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు ఏపీ నుంచి రూ.12,500 కోట్లు రావాల్సి ఉందని కేంద్రానికి తెలంగాణ వేర్వేరుగా లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. బకాయిలను తెలంగాణ సంస్థలు అంగీకరించినట్లయితే వాటి చెల్లింపులకు పట్టుబట్టవచ్చని.. అంగీకరించనందున తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది.
చట్టప్రకారం పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని.. సెక్షన్ 92లో సహజ న్యాయసూత్రాలకు మినహాయింపు లేదన్నారు. బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆలోచనా రహితంగా ఉత్తర్వులు జారీ చేసిందని.. ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది అన్నారు. బకాయిలకు సంబంధించిన సమావేశాలు జరిగినా ఎంత మొత్తం అన్నది తేల్చలేదన్నారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు తెలంగాణకు ఎలాంటి నోటీసు జారీ చేయకపోవడం తప్పుబట్టింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.