తిరుమల శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే వార్త. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పటికే హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సమయాల్లో ఎయిర్ అంబులెన్స్ గానూ.. మిగతా సమయాల్లో జాయ్ రైడ్లతో భక్తులతో పాటు నగరవాసులకు విహంగ వీక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నైకు చెందిన ఏరోడాన్ సంస్థ.. జూన్ నెలలో తిరుపతిలో జాయ్ రైడ్ మొదలు పెట్టి.. భక్తులకు ఆకాశంలో వినోదాన్ని పంచింది. ఇదే సంస్థ.. తాజాగా కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసి దేవదేవుని ఆశీస్సులు కోసం తిరుపతికి తీసుకుని వచ్చింది. తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ.. ఆలయం నుంచి అర్చకులు అక్కడకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. తిరుమలకు రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే.. అందులో చాలా మంది శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత.. తిరుపతిలో ఉన్న మిగతా ఆలయాలతో పాటు సమీపంలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు కూడా సందర్శించుకుంటారు. కాగా.. కొంత మంది భక్తులకు తిరుపతి చుట్టుపక్కల ఉన్న కొండలు, అడవీ అందాలు, ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఏరోడాన్ సంస్థ హెలికాప్టర్ రైడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. ఈ హెలికాప్టర్ రైడ్‌ల కోసం ఆన్‌లైన్ బుకింగులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైడ్ కోసం 6 సీట్ల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. పైలెట్‌తో పాటు మరో ఐదుగురు పర్యాటకులు ఈ హెలికాప్టర్‌లో ప్రయాణించవచ్చు. కాగా.. ఈ రైడ్‌లో భాగంగా తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు పర్యాటకులను తీసుకెలళ్లి.. తిరిగి తీసుకొస్తారు. ఈ జాయ్ రైడ్ 8 నిమిషాలు ఉండనుంది. అయితే.. ఈ రైడ్ కోసం ఒక్కొక్కరి రూ.6 వేలు చొప్పున టికెట్ ఉంటుంది. అయితే.. గంటకు 6 ట్రిప్పులు వేసేలా ఏరో డాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. శ్రీవారి భక్తులే కాకుండా, తిరుపతి వాసులు కూడా ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. కాగా.. ఇప్పుడు మరో హెలికాప్టర్ కూడా అందుబాటులోకి తీసుకురావటంతో.. మరింత మంది తిరుపతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.