2023 ఏడాదిలో కూడా మహిళలను హీనంగా చూడటం ఏంటని కేరళ హైకోర్టు గురువారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఓ విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన కేరళ హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు.. తమ తల్లులు, అత్తలకు బానిసలు కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు.. అవి పురుషుల ఆధిక్యాన్ని చాటి చెప్పేలా ఉన్నాయని పేర్కొంది. ఈ కేసును కోర్టు బయట సులభంగా పరిష్కరించుకోవచ్చన్న మహిళ భర్త తరపు న్యాయవాది వాదనపైనా కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
కొచ్చికి చెందిన ఓ విడాకుల కేసులో త్రిస్సూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు మౌఖికంగా విమర్శించింది. ఈ సందర్భంగా మహిళలు తమ తల్లి, అత్తకు బానిసలు కాదని పేర్కొంది. మహిళ నిర్ణయాలు ఏ విధంగానూ తక్కువ కాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ తెలిపారు. ఓ మహిళ తనకు విడాకులు కావాలని దాఖలు చేసిన పిటిషన్‌ను త్రిస్సూర్ ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఆమె ఫిర్యాదులను సాధారణ ఆగ్రహంగా పేర్కొంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల విభేదాలను మరిచి వైవాహిక జీవితంలో పవిత్రత పాటించాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా త్రిస్సూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పితృస్వామ్యానికి మద్దతు తెలిపేలా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది.
ఇలాంటి ఉద్దేశాలు, 2023 లోనూ కొనసాగవని జస్టిస్ దేవన్ రామచంద్రన్ తెలిపారు. ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని ఆమె తల్లి లేదా అత్త నిర్ణయం కంటే తక్కువగా చూడకూడదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా స్త్రీలు తమ తల్లికి గానీ లేదా అత్త గారికి కానీ బానిసలు కాదనే విషయాన్ని తెలిపింది. అయితే ఈ వివాదాన్ని కోర్టు బయట సులభంగా పరిష్కరించుకోవచ్చని భర్త తరపు న్యాయవాది చేసిన వాదనపైనా కేరళ హైకోర్టు జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళ ఇష్టపూర్వకంగా ఉంటేనే తాను కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు సూచించగలనని జడ్జి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మహిళ భర్తకు కూడా కేరళ హైకోర్టు జడ్జి కొన్ని సూచనలు చేశారు. ప్రతీ మహిళకు సొంతంగా ఆలోచించుకునే మనసు ఉంటుందని.. అలాంటి వారిని మధ్యవర్తిత్వం చేయమని బలవంతం చేస్తారా అని భర్తను ప్రశ్నించింది. అలా చేసినందుకే సదరు మహిళ.. విడాకులు కోరే పరిస్థితి వచ్చిందని తెలిపింది. భార్య పట్ల మర్యాదగా ప్రవర్తించాలని.. ఆమె వృత్తి రీత్యా పని చేస్తున్నందున విడాకుల ప్రక్రియను ఆమె సౌలభ్యం మేరకు తలస్సేరి కోర్టుకు బదిలీ చేయాలన్న మహిళ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.