13లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.3వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ఆక్రందన దీక్షలు’ పేరుతో ఎస్టీయూ నేతలు, టీచర్లు నిరసన కార్యక్రమాలు చేశారు. ఎస్టీయూ అధ్యక్షుడు పశ్చిమగోదావరిలో, ప్రధాన కార్యదర్శి కర్నూలులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెండు లక్షల మంది టీచర్ల ఆర్జిత సెలవుల బకాయిలు రూ.800 కోట్లు, భవిష్యనిధి, జీవిత బీమా, కరువు భత్యం, 11వ పీఆర్‌సీ బకాయిలు మొత్తం కలిపి రూ.3వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాలన్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా చెల్లిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ హామీ ఇచ్చినా అది అమలుకాలేదని చెప్పారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, జీవో 117తో తరగతులు విలీనం చేశారని, కొత్తగా బైజూస్, టోఫెల్ అంటూ మొత్తంగా పాఠశాల విద్యను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.