తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... కంబాలపేటకు చెందిన సిద్ధాబత్తుల మార్గరేట్ జూలియానా(63), నాగేశ్వరరావు దంపతులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైరయ్యారు. వీరికి సంతానం లేకపోవడంతో 13 ఏళ్ల కిందట ఒక బాలికను దత్తత తీసుకున్నారు. నాగేశ్వరరావు ఏడాది కిందట మరణించారు. దీంతో జూలియానా, బాలిక మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన గార ఆకాశ్‌తో ఆ బాలిక ప్రేమలో పడడం, అతడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో జూలియానా కూతురిని మందలించారు. అయితే, తమ ప్రేమకు తల్లి అడ్డొస్తోందని బాలిక ద్వేషం పెంచుకొంది. పైగా ఇద్దరూ ప్రభుత్వోద్యోగులుగా పనిచేయడంతో వారి పేరిట పెద్ద మొత్తంలో ఆస్తులుంటాయని, జూలియానాను అడ్డుతొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకే వస్తుందని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఈ నెల 17నబాత్‌రూంలో కాలుజారిపడి గాయపడిని జూలియానా మంచంపట్టారు. ఇదే అదనుగా భావించిన బాలిక.. గార ఆకాశ్‌తోపాటు, అయ్యప్పనగర్‌కు చెందిన వీపీ అక్షయ్‌కుమార్, ఆర్యాపురానికి చెందిన దాశ్యం దినేశ్‌రాయ్‌లను ఇంటికి పిలిచింది. అప్పటికే సీసీ కెమెరాలను స్విచ్ఛాఫ్ చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రిస్తున్న జూలియానా కాళ్లను దినేశ్, చేతులను అక్షయ్ అదిమిపట్టుకోగా బాలిక, ఆకాశ్ వస్త్రంతో ఆమె ముఖంపై గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మృతురాలి సోదరుడు కాటి అగరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. బాలికను జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌పై తరలించారు.