నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లిలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిజనవాడకు చెందిన యువతిపై ఆమె బావ అయిన బాలకృష్ణ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి అంకుపల్లి హరిజనవాడలో నివాసం ఉంటోంది. గత నెల 27న యువతి తల్లి తన చిన్న కూతురి కాన్పు కోసం నెల్లూరు నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చూసిన బావ బాలకృష్ణ.. ఇంట్లోకి దూరి తన నోరు అదిమిపట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. చెల్లెలు భర్త కావడంతో ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోయామని ఆమె వాపోయింది.
శుక్రవారం (అక్టోబర్ 27) రాత్రి నిందితుడు తన కుటుంబసభ్యులతో కలిసి తమ ఇంటిపై దౌర్జన్యం చేశాడని.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దూషించాడని బాధితురాలు ఆరోపించింది. ‘నేను పెద్దగా చదువుకోలేదు. ఇంట్లో ఇద్దరం ఆడవాళ్లమే ఉంటాం. మేం ఏం చేయగలం. పరువు పోతుందని ఇన్ని రోజులు మౌనంగా ఉంటే, ఇంత దౌర్జన్యం చేస్తాడా’ అంటూ బాధితురాలు కంటతడి పెటట్ింది. తనపై అత్యాచారం చేసిన బాలకృష్ణను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.