నెల్లూరు జిల్లా కావలి దగ్గర ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి ఘటన కలకలంరేపింది. ఈ ఘటనలో డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రజల మధ్య విధులు నిర్వహించే ఆర్టీసి కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు చట్ట పరంగా తీసుకుంటామన్నారు. డ్రైవర్‌పై దాడి చేసినవ్యక్తులుపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427, IPC, Dt.26.10.23లో కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు కావలి పోలీసులు తెలిపారు. ఈ దాడిని స్థానిక ఎమ్మెల్యే కూడా ఖండించారు.. చికిత్స పొందుతున్న డ్రైవర్‌కి సంఘీభావం తెలిపారు.
విజయవాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి కావలి మీదుగా విజయవాడ వెళుతోంది. ఈ క్రమంలో కావలిలోని ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి.రాంసింగ్ తన ముందున్న బైక్ అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో ఆ ద్విచక్రవాహనదారుడు వాదనకు వచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. ఆ వాహనదారుడు తన స్నేహితులకు చెప్పాడు.. మొత్తం 14 మంది ఆర్టీసీ బస్సును వెంబడించారు. పట్టణ శివార్లలోని మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల దగ్గర బస్సును అడ్డగించారు.
బస్సులో నుంచి కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ కాలితో కడుపులో తన్నారు. పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు.. ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఈ దాడి ఘటనను బస్సులోని ఓ ప్రయాణీకుడు రికార్డు చేస్తుండగా అతడి మొబైల్‌ను ధ్వంసం చేశారు. డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆందోళన చేస్తామని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు హెచ్చరించారు.