ఓ గంటలో వివాహం.. బంధువులతో ఇల్లంతా కళకళలాడుతోంది. వధువు తరఫు బంధువులంతా వరుడి ఇంటికి వచ్చారు. ఇంతలో ఊహించని ట్విస్ట్‌తో అందరూ అవాక్కయ్యారు. విశాఖకు చెందిన యువతితో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో వివాహం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన వధువు, వరుడితో పాటు ఇరు కుటుంబాల బంధువులు మండపం వద్దకు చేరుకున్నారు.
ఇంతలో వరుడు ట్విస్ట్ ఇచ్చాడు.. పెళ్లి చేసుకోను అంటూ నిరాకరించడంతో, వధువు తరఫు వారంతా అవాక్కయ్యారు. భయాందోళనకు గురైన వరుడు బాత్రూమ్‌లోకి వెళ్లి తలదాచుకున్నాడు. అక్కడి నుంచే డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెండు కుటుంబాలతో చర్చించారు. ఏ కారణమూ లేకుండానే పెళ్లికి నిరాకరించిన వరుడి ప్రవర్తనపై వధువు తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో రాజీ ప్రయత్నాలు చేశారు.
ఓ గంటలో పెళ్లి జరగాల్సి ఉండగా.. వివాహం వద్దని వరుడు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. రింగులు మార్చుకొని, కట్నకానుకలు తీసుకున్న తర్వాత ఇలా నాకు ఇష్టం లేదని ముఖం చాటేసిన పెళ్లి కొడుకుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పెళ్లి కుమారుడు సంతోష్‌తో పాటు.. వధువును కూడా స్టేషన్‌కు పిలిచిన ఈ వ్యవహారంపై ఆరా తీశారు.. అయితే, గత వారం రోజులుగా పెళ్లికొడుకుతో పెళ్లికూతురు ఫోన్‌లో మాట్లాడలేదట.. అందుకే అలిగి.. పెళ్లి చేసుకోవడానికే నిరాకరించాడని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.