ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు నిబంధనల మేరకు నడుచుకుంటాయన్నారు. చంద్రబాబు కదలికలను పసిగట్టాల్సిన అవసరం ఎవరికీ లేదని.. అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడని చంద్రబాబు చెప్తున్నారన్నారు. ఆ లేఖ ఏంటో? రాసినదెవరో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. అలాగే చంద్రబాబుకు వెంటనే బెయిల్ వచ్చే ఓ ఐడియా కూడా చెప్పారు ఏపీ మంత్రి.
చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని, ప్రాణహాని అంటూ రెండు వాదనలు వినిపిస్తున్నారని.. ఇదంతా చూస్తుంటే.. బెయిల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం కోసమే ఈ ఆందోళనలు అని తన అభిప్రాయం అన్నారు. చంద్రబాబుకు అంబటి ఓ ఉచిత సలహా ఇచ్చారు.. ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. పెండ్యాల శ్రీనివాస్‌ని చంద్రబాబు దేశం దాటించారు. ఆయన్ని పిలిపించి సీఐడీకి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే కొందరు ఉన్మాదులు దాడి చేసేందుకు యత్నించారన్నారు మంత్రి. హఠాత్తుగా ఒక పది మంది వేసేస్తామని తనను బెదిరించారని చెప్పారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులే తనపై దాడికి యత్నించారన్నారు. డబ్బు మదంతో కొందరు ఉన్నాదులు పేట్రేగిపోయారని.. కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబటి హెచ్చరించారు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితే లేదని.. ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారన్నారు. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లారని.. వారికి దమ్ముంటే రాజమండ్రి జైలు గోడలు పగులకొట్టండి అన్నారు. తనపై దాడికి యత్నించిన ఎనిమిది మంది ఒకే కులం వారని.. వారికే కాదు తనకూ కులం ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు ఖమ్మంలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఆయన కారును చుట్టుముట్టారు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషణలకు దిగారు. కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలో మంత్రి సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిదిమందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌గా స్పందించారు.. టీడీపీ కార్యకర్తలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.