రెండు రైళ్లకు ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి గౌహతి వెళ్లే (12509)ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. కావలి- తెట్టు రైల్వే స్టేషన్ల మధ్య దిగువ మార్గంపై ఏర్పాటు చేసిన ఫిష్‌ప్లేటును ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో లోకోపైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ముక్కలైన ఫిష్‌ప్లేట్లు దూరంగా పడిన విషయాన్ని గమనించి.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం 9.56 గంటలకు ఈ ఘటన జరిగింది.
ఇంజిన్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతితో అక్కడి నుంచి బయలుదేరారు. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు ఐపీఎఫ్ బి.హీరాసింగ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను సంఘ విద్రోహ చర్యగా అనుమానిస్తున్నారు. గతంలో కావలికి దక్షిణం ముసునూరు దగ్గర ఓ సూపర్ ఫాస్ట్ రైలుకు పట్టా ముక్క ఉంచిన ఘటన గురించి తెలిసిందే.
మరోవైపు రైలు పట్టాలపై ట్రాక్టర్ నిలిచిపోవడంతో నల్గొండ జిల్లాలో గుంటూరు నుంచి వికారాబాద్ వెళుతున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. మాడుగులపల్లికి చెందిన చెన్నయ్య ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకుని పట్టాలపై నుంచి అవతలికి దాటేందుకు యత్నించాడు. ఇంతలో ట్రాక్టర్ ట్రాలీ చెరువుపల్లి వెళ్లే మార్గంలో పట్టాలపై ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
ట్రాక్టర్ ఇరుక్కుపోయిన సమయంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ట్రాక్టర్ ట్రాలీ నిలిచిపోయిన విషయాన్ని అప్పటికే రైల్వే అధికారులకు తెలియజేయడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. అనంతరం జేసీబీతో ట్రాక్టర్‌ను తొలగించారు. రైలు ఆగిపోవడంతో అరగంట సేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.