జగన్ సర్కార్‌పై సీబీఐ మాజీ జేడీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు.. అద్భుతంగా అమలవుతున్నాయంటూ పొగడ్తల వర్షం కురిపించారు. లక్ష్మీనారాయణ బాల్యంలో శ్రీశైలంలో విద్యాభ్యాసం చేశారు.. అయితే ఆ స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశైలం వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని కూడా ఈ కార్యక్రమాని ఆహ్వానించేందుకు లక్ష్మీనారాయణ వెళ్లారు. శిల్పా చక్రపాణిరెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య కార్యక్రమంలో ఉన్నారు. వేదికపైకి వచ్చి మాట్లాడాలని సీబీఐ మాజీ జేడీని శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. దీంతో ఆయన ఈ కార్యక్రమాలపై తన అభిప్రాయాలను చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం చక్కగా అమలవుతోంది అన్నారు లక్ష్మీనారాయణ. తాను చదువుకున్న స్కూల్ కూడా చాలా అందంగా మారిందని.. చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, పిల్లలకు మంచి ఆహారం అందించడం, అందులో రాగి జావను చేర్చడం అభినందనీయం అన్నారు. పోషకాహారం అందించడం ప్రభుత్వం బాధ్యతని.. విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.
అలాగే హెల్త్ క్యాంపులు ఒక రోజుతో ముగిస్తుంటారని.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. సహజంగా ఆరోగ్య కార్యక్రమాలకు రావాలంటూ ప్రజలను పిలుస్తుంటారని.. డాక్టర్లే ప్రజల ఇళ్ల దగ్గరకు వెళుతున్నారన్నారు. ప్రజల్ని పరీక్షించి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నాయో గుర్తించి, అలాంటి వారిని ఇవాళ ఈ క్యాంపుకు పిలిచారన్నారు. ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. ఆయా ఆరోగ్య ఇబ్బందుల నుంచి ప్రజలను బయట పడేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని నిజంగా అభినందించాలి అన్నారు.
మరోవైపు ప్రతి ఒక్కరూ రక్త, అవయవ దానానికి ముందుకురావాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు, పాఠశాల నిర్మించి ఆరు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 28, 29 తేదీల్లో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన, అవయవ దాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సున్నిపెంటలో విడుదల చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రాజెక్టు పాఠశాల ఆవరణలో 6 వేల మందితో స్పోసా గీతాన్ని ఆలపించనున్నట్లు తెలిపారు. వర్డల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కోసం దరఖాస్తు చేశామన్నారు. జేడీ లక్ష్మీనారాయణ జగన్ సర్కార్‌పై పొగడ్తల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. జేడీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాను అన్నారు.