ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. డిసెంబరు 9 వరకు ఎవరైనా తమ అభ్యంతరాలు తెలిపితే.. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు కొన్ని అభ్యంతరాలు తెలిపాయని.. సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించామని.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.
ఓటర్ల జాబితా సవరణల విషయంలో ఎవరైనా అక్రమాలకు ప్రయత్నించినట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితా తయారీలో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో చర్యలకు ఆదేశించామన్నారు. ఎన్నికల సంఘానికి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందినా కచ్చితంగా స్పందిస్తామన్నారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారెవరైనా ఓటరుగా నమోదయ్యేందుకు గతంలో దరఖాస్తు చేసుకోపోతే డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది అన్నారు. 2024 ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండేవారెవరైనా కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తప్పుడు అభ్యంతరాలు, తప్పుడు దరఖాస్తులు సమర్పించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. మార్గదర్శకాలు పాటించని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల జాబితా తయారీ అంశంలో జోక్యం చేసుకునే పోలీసుల పైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రం అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. తాజా ముసాయిదా ప్రకారం పెరిగిన ఓటర్లు 2,36,586 మంది.. 2023 ఓటర్లజాబితా తొలగించిన ఓట్లు 13,48,203.
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఓటర్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. చంద్రగిరిలో జనవరిలో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఏకంగా 12,051 మంది ఓటర్లు పెరిగారు. ఏప్రిల్ 15 నుంచి ఈ నియోజకవర్గంలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం 34,015 దరఖాస్తులు, తొలగింపునకు 13,368 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య భారీగానే పెరిగింది. ఇక్కడ 6,230 మంది ఓటర్లు పెరిగారు.