వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఎన్ఐఏ కోర్టుకు కీలకమైన దరఖాస్తు చేసుకున్నారు. తాను ఐదేళ్లుగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నానని.. తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాసి విన్నవించుకునేందుకు అనుమతివ్వాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని కోరారు. శుక్రవారం విశాఖ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి శ్రీనును హాజరుపరిచారు.
ఎన్‌ఐఏ కోర్టులో వాదనలు జరుగుతుండగానే, లోతైన దర్యాప్తు కావాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, 8 వారాలపాటు విచారణను హైకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి విచారణా జరగదని, డిసెంబరు 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది. దీంతో జనపల్లి శ్రీనును తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే శ్రీనుకు బెయిల్ రావడం లేదని నిందితుడి తరఫు న్యాయవాది సలీం అంటున్నారు.
మరోవైపు కోడికత్తి కేసులో విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ కోర్టు బెయిలు ఇచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 22న నిరాకరించడంతో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం శుక్రవారం అప్పీల్‌పై విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. విచారణను నవంబరు 3కు వాయిదా వేసింది.