కృష్ణా జిల్లాకు చెందిన మహిళ భర్త విదేశాల్లో ఉంటున్నారు. ఆమె భర్తకు విడాకులిప్పించి ఆమెను పెళ్లి చేసుకొని ఆ తర్వాత కట్నం కోసం ఇంకో పెళ్లికి సిద్ధమైన భర్త, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కానూరు మురళీనగర్‌కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) 2001లో గన్నవరానికి చెందిన వాసుదేవశర్మతో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత అతడు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. ఆ సమయంలో శ్రామణి పుట్టింట్లో ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమెకు కొన్నేళ్ల క్రితం ముదినేపల్లి మండలం పెదగొన్నూరుకు చెందిన లక్ష్మయ్య, కనకదుర్గ దంపతులతో పరిచయం ఏర్పడింది.
వీరి ద్వారా వీరి కుమారుడు ఫణిరంజిత్ పరిచయంకాగా.. అది ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ సన్నితంగా ఉంటున్నారు. ఫణిరంజిత్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వాసుదేవశర్మతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ ఫణిరంజిత్, అతడి తల్లిదండ్రులు చెప్పడంతో ఈమె భర్త వాసుదేవశర్మ నుంచి 2022లో విడాకులు పొందింది. గతేడాది ఏప్రిల్‌లో గాయత్రికి ఫణిరంజిత్‌తో వివాహం జరిగింది. కొంతకాలం నుంచి అతడు మద్యం తాగి వచ్చి భార్యను కొడుతున్నాడు.
అలాగే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. మూడు నెలల నుంచి ఇతను ఇంటి వైపు చూడకుండా ఉండటంతో పాటు అధిక కట్నం తెచ్చే మరో మహిళను పెళ్లి చేసుకుంటానంటూ తేల్చి చెప్పాడు. దీంతో శ్రావణి అత్తమామలకు చెప్పగా.. పెళ్లికి అడ్డుపడితే తొలగించుకుంటామంటూ వారు బెదిరించారు. ఈమె ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు భర్త ఫణిరంజిత్ అత్తమామలు లక్ష్మయ్య, కనకదుర్గలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.