భారత్, పాక్ సరిహద్దుల్లో నిత్యం పాకిస్థాన్ ఏదో ఒక రకంగా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. ఓ వైపు అక్రమ చొరబాట్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను మన దేశంలోకి పంపించడం.. డ్రగ్స్‌ను భారీగా సరిహద్దులు దాటించి దేశంలో విస్తరింప జేయడం, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న జమ్మూ కాశ్మీర్ వాసులు.. గతంలో ఉపయోగించి మూసివేసిన బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వెంటనే బంకర్లలోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకోవచ్చని భావిస్తున్నారు.
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ చేస్తున్న కాల్పులతో కాశ్మీర్ వాసులు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బంకర్లను ఆశ్రయిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉన్న బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఏ క్షణమైనా తమ నివాసాలపై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున బంకర్లలో తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాక్‌ను ఏమాత్రం నమ్మబుద్ధి కావడం లేదని త్రేవా గ్రామ సర్పంచ్ బల్బీర్‌కౌర్ మీడియాకు వెల్లడించారు.
2018 తర్వాత తమ గ్రామాలపై మోర్టార్ దాడులు జరిగాయని.. బంకర్లు ఉపయోగంలో లేకపోవడంతో అందులోకి వెళ్లలేకపోయామని బల్బీర్ కౌర్ చెప్పారు. ఈ క్రమంలోనే స్థానికులంతా బంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఏళ్లుగా బంకర్లతో పని లేకపోవడంతో నీరు నిలిచి, చెట్లు మొలిచి.. పాములు సహా ఇతర జంతువులు ఆవాసం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని బంకర్లలో కరెంటు, బాత్‌రూం వంటి సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. పాక్ రేంజర్ల దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు 2017 డిసెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం 14,460 వ్యక్తిగత, సమూహ బంకర్లను నిర్మించింది. జమ్మూ, కథువా, సాంబా, పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో ఈ బంకర్లను నిర్మించారు. ఆ తర్వాత మరో 4 వేల అదనపు బంకర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే గురువారం పాక్ రేంజర్ల నుంచి కాల్పులు జరిగాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో రాత్రి 8 గంటల నుంచి సుమారు 7 గంటలపాటు కాల్పులు జరిగినట్లు భారత సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ సహా మరో మహిళ గాయపడ్డారు. అంతకుముందు అక్టోబరు 17 వ తేదీన బీఎస్‌ఎఫ్ జవాన్ల పోస్టుపై జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల జరుగుతున్న కాల్పుల విషయాన్ని పాకిస్థాన్ దృష్టికి బీఎస్‌ఎఫ్ అధికారులు తీసుకెళ్లారు. సరిహద్దు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పాక్‌కు సూచించారు. భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు 2021 ఫిబ్రవరి 25 వ తేదీన ప్రకటించాయి. 2003 లోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైనప్పటికి పాక్ నుంచి పలుమార్లు కాల్పులు జరిగాయి. 2020 లో సుమారు 5 వేలకు పైగా దాడులు చోటు చేసుకున్నాయి.