నెల్లూరు జిల్లా, కలిగిరి తహసీల్దారు కార్యాలయం సమీపంలో గురువారం గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... కలిగిరికి చెందిన మహేశ్వరరావు అనే వ్యక్తి తహసీల్దారు కార్యాలయం సమీపంలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. పాఠశాలను రేకుల షెడ్డులో నిర్వహిస్తూ జమ్ముతో కప్పిన పూరిపాకల్లో ఆయన నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయన భార్య ఖాళీ అయిన సిలిండర్ పక్కన పెట్టి కొత్త సిలిండర్‌ను బిగించింది. టీ తయారుచేసే క్రమంలో స్టౌ వెలించగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు లీకైన సిలిండర్‌ను బయట పడేశారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో బీరువా, వంటసామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్నట్లు బాధితుడు తెలిపాడు.