సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీంలో పిటీషన్ వేశారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు ఏమిటి సంబంధమని కోర్టు ప్రశ్నించారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయవచ్చని ఎంపీ రఘురామ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని కోర్టు అడుగగా.. ఎంపీ రఘురామ కూడా వైసీపీ ఎంపీనే అని ఎంపీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.